sinIseemalO saMgeetaM
(Music in the cinema field)

Ghantasala Venkateshwara Rao

RTS Transcribed by NaChaKi

Editors Note: This article is in Unicode; If you cannot see the Telugu script, please scroll down to read the RTS Transcription, or see the pdf version here

సుమారు రెండు దశాబ్దముల నుంచి సంగీత దర్శకునిగా, నేపధ్య గాయకునిగా సినిమా సంగీత ప్రపంచంలో నేను చేసిన పరిశ్రమకు ఆధారభూతమైన విశ్వాసాలకు, తద్భవమైన అనుభవాలు రసికులూ, రసజ్ఞులూ అయిన ప్రేక్షకలోకానికి తెలియజేయడం అప్రస్తుతం కాదనే నమ్మకంతో ఈ మాటలు వ్రాస్తున్నాను. తన సాధన, కృషి ఫలించాలంటే, సార్థకత చెందాలంటే ప్రతి కళాకారుడూ ప్రజలతో తనకు గల సంబంధాన్ని నిత్యము గుర్తిస్తూ, కళారంగంలో తనకున్న బాధ్యతలను, యెదుర్కొనవలసిన శక్తులను వారికి తెలియజేస్తూ వారి నుండి విజ్ఞతాపూర్వకమయిన సలహాలను, అభిమానోపేతమయిన సానుభూతినీ పొందుతుండటం అవసరమవుతుంది.

ప్రతి జాతి సంస్కృతీ కళారంగంలో తన కృషినీ, ధ్యేయాన్ని, ఒక విశిష్టమైన పద్ధతిని రూపొందించుకొంటుంది. భారతదేశం కూడా సహస్రాబ్దాలుగా లలితకళలన్నిటిలోనూ తన విశిష్టతను అడుగడుగునా ప్రస్ఫుటంగా ప్రకటిస్తూ తన సాధనను కొనసాగిస్తూనే ఉంది.

భారతీయ జీవన రంగంలో సంగీతకళకున్న స్థానం మరే సంస్కృతిలోనూ లేదని చెప్పడం సాహసం కాదు. భారతజాతి అనాదిగా, సంగీతకళను ప్రత్యేకమైన విధానాలతో, విభిన్న మార్గాలలో పయనింపజేసి ఎంతో ఉజ్జ్వలమైన ఫలితాన్ని సాధించింది. సంప్రదాయసిద్ధమైన ఈ కళావిశేషాన్ని విస్మరించి మనం ఏ విధమైన అభివృద్ధినీ సాధించలేము.

భారతీయ సంగీతం ఎన్ని భిన్న సాంప్రదాయాల్ని అనుసరించినా, ఎన్ని భిన్న రీతుల్ని ప్రదర్శించినా, రససిద్ధిలో ఈ భిన్న ఫణతులు అవలంబించే మార్గములో ఒక విచిత్రమైన ఐక్యతను ఏర్పరచుకొంది. సూక్షంగా పరిశీలిస్తే, భారతీయ సంగీతంలో ఏ ప్రాంతపుదైనా సరే ఏకత్వం గోచరించక మానదు.

ప్రధానంగా భారతీయ సంగీత స్రవంతి రెండు రసవాహినులుగా ప్రవహించినది. ఒకటి స్వరరాగ తాళ ప్రధానమైనది. శాస్త్రీయమైన వ్యక్తిత్వాన్ని కలిగినది. నాదోపాసనకు ఉపయుక్తమైనది. రెండవది జీవన శకట ప్రయాణానికి అహరహమూ లయ కలుపుతూ నిత్యజీవితాన్ని సుమధురం చేసేది. మొదటిది 'మార్గ' సంగీతమని, రెండవది 'దేశి' సంగీతమని పండితులు చెప్పారు. ఒకటి రసాత్మకమైనది. రెండవది భావాత్మకమైనది. ఒకటి స్థితి ప్రధానమైనది, మరొకటి గతి ప్రధానమైనది. జీవితంలోని వైవిధ్యాన్ని తొలగించి ఒకే నాదాత్మలో స్వరాన్ని అనుభవింపజేసేది మార్గసంగీతమైతే, ఒకే ఆత్మను జీవితంలోని వివిధ రంగాలలో ప్రతిబింబించి హృదయస్పందనం కలిగించేది దేశి సంగీతం.

మార్గసంగీత సంప్రదాయ సరళి ఉన్నత వర్గాన్ని ఆకర్శించి రాజాస్థానములలోనూ, దేవస్థానములలోనూ తన ప్రతిభను ప్రసరింపజేస్తే, దేశి సంగీతం ప్రతి పామరుని హృదయస్థానంలోను సింహపథం చేసుకొంది. మార్గసంగీతం భారతీయాత్మతను తాత్త్వికమైన రసానుభూతితో మైమరపింపజేస్తే, దేశి సంగీతం రసికమైన రసపుష్టితో ప్రజానీకాన్ని మురిపింపజేసింది. ఇందుచేతనే శాస్త్రీయ వాగ్గేయ రచనలలో భక్తిభావానికే అధికమైన ప్రాచుర్యం లభించింది.

ఒక విధంగా అనుకోవచ్చును. శాస్త్రీయ సంగీతం భక్తిభావపునీతమైతే దేశి సంగీతం నవరసభరితం. జీవితంలోని ప్రతి రసాత్మక సన్నివేశాన్ని తనలో ఇముడ్చుకుంది దేశి సంగీతం. ఈ భిన్న రసాల సన్నివేశాలను ఒకే నాదవర్ణంలో చిత్రించినది మార్గ సంగీతం.

ఉడుపుల వేళల్లో పచ్చని పొలాల్లో పని చేస్తూ, తమ కష్టాన్ని మరచి గొంతెత్తి పాడే పల్లె పడుచుల పాటలలోనూ, నూర్పుల కళ్ళాలలో ఆనందోత్సాహంతో ఊగుతున్న రైతు యువకుల పదాలలోను, ఏలేలో పాటలలోనూ, జోల పాటలలోనూ, పెండ్లి పాటలలోనూ, వదినా మరదళ్ళ సరాగాలలోనూ, ఆలూమగల సరసాలలోనూ, అత్తాకోడళ్ళ సంవాదాలలోనూ, నలుగు పాటలలోనూ, తత్త్వ కీర్తనలలోనూ, పడవ పాటలలోనూ, యక్షగానాలలోనూ, బుఱ్ఱకథలలోనూ, గొల్ల సుద్దులలోనూ, వీధి భాగవతాలలోనూ, జముకల పాటలలోనూ వినిపించేది దేశి సంగీతమే.

ఇంత వరకు మన జాతీయ సంగీతం, మార్గ పద్ధతి అయితేనేమి, దేశి పద్ధతి అయితేనేమి, వివిధ శాస్త్రీయ సంగీత రచనల రూపంలోనూ, పద్య పఠన రూపంలోనూ హరికథాది రూపాలలోనూ, పైన చెప్పుకున్న దేశీయ రూపాలలోనూ వ్యక్తమయింది.

ప్రస్తుత నాగరిక జీవన విధానాన్ని బట్టి, పాశ్చాత్య సంగీత ప్రభావాన్ని బట్టి వ్యావహారిక భాషా ప్రభావాన్ని బట్టి, ఒక నూతన సంగీత సంప్రదాయ నిర్మాణం అతి ఉత్సాహంగాను, అతి త్వరితంగాను సాగుతున్నది. కొంత కాలం నిశ్చలంగా ఉన్న మన దేశీయ సంగీతం సినిమా కళ యొక్క అభివృద్ధితో నూతనోత్తేజాన్ని పొంది కొత్త రంగులు రంగరించుకొంది.

ఈ నూతన సంగీత సంప్రదాయ నిర్మాణం సినీ సంగీత దర్శకుల ప్రతిభా విశేషాల బట్టి నిర్మింపబడుతున్నదవడం పరిణామమైనా, తన విశిష్టతకు భంగం కలిగిస్తున్నదేమోయని భయపడుతున్నది. అందుచేత సంగీతంలో నూతనమైన ప్రయోగాలనూ, వినూత్నమైన విశేషాలనూ, విచిత్రానుభూతులను వివిధ మార్గాలలో అభివృద్ధులను సినీ సంగీత దర్శకుల నుండి మాత్రమే దేశం ఆశిస్తున్నదనడం వాస్తవం.

ఇటువంటి పరిస్థితుల్లో సంగీత దర్శకుడు మన జాతీయ ధోరణులైన రసాత్మక ప్రాధాన్యమైన మార్గ సంగీతాన్ని, భావాత్మక ప్రాధాన్యమైన దేశి సంగీతాన్ని, విజాతీయ సంగీత రీతుల్ని, తన నూతన సంప్రదాయ సృష్టికి ఉపకరణములుగా తీసుకొంటున్నాడు.

ఈ నూతన సంప్రదాయ నిర్మాణం ఉత్తర భారతదేశంలోనే ప్రారంభించబడినదనటం సాహసం కాదు. సినిమా పరిశ్రమకు పూర్వం కూడా మన నాటక సంగీతంలో పద్యపఠనానికి శాస్త్రీయ సంగీత రాగాలనూ, పాటలకు ఉత్తర దేశ లలిత సంగీత రచనలనూ, ఒరవడిగా తీసుకొనడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ సంప్రదాయ నిర్మాణం సినిమా యొక్క పారిశ్రామిక పరిమితుల్ని బట్టి మాత్రమే సాగుతున్నదన్న మాట యదార్థం.

నేటి వరకూ నడచిన సినిమా సంగీత చరిత్ర ఒక మారు సింహావలోకనం చేస్తే తొలినాటి సినిమా సంగీతంలో శాస్త్రీయ సంగీత ప్రభావమే ఎక్కువగా ఉండి రాగప్రధాన రచనలే ఎక్కువగా కనబడుతాయి. కాని కాలక్రమాన సంగీత దర్శకులు భాష యొక్క పలుకుబడికీ, నుడికారపు గమనానికి, భావావేశానికీ దేశి సంగీతమే అనుకూలమైనదని గ్రహించారు. ఈ దేశి రీతిని సినిమా సంగీతంలో మొదట ప్రవేశపెట్టిన మార్గదర్శి నౌషద్‌ అనే మాట సర్వ జనామోదం పొందుతుందనే నమ్ముతున్నాను. దేశి సంగీత పద్ధతులలో, ప్రతి రసాత్మక సన్నివేశానికీ ఆయన తన సంగీత రచనలతో రూపించిన రాగ తాళముల ప్రయోగం సమకాలిక సంగీత దర్శకులకు స్వీకారయోగ్యమయినది. శృంగారగీతాలు, యుగళగీతాలు, విషాదగీతాలు, ప్రేమగానాలు, బృందగానాలు మొదలైన ఆయన సంగీత రచనలన్నీ ఆయనను నవ్య సాంప్రదాయ నిర్మాతగా నిరూపిస్తాయి.

నౌషద్‌తోబాటు, ప్రతిభావంతులయిన ఇతర సంగీత దర్శకుల మేధస్సు కూడ ఈ క్రొత్త సంప్రదాయాన్ని సముజ్జ్వలపరిచింది. నవ్య సంగీత నిర్మాతలుగా పేర్కొనబడవలసిన వారిలో ప్రధానులు సి.రామచంద్ర, అనిల్‌ బిస్వాస్‌, పంకజ్‌ మల్లిక్‌, వసంత దేశాయ్‌, హేమంతకుమార్‌, ఓ.పి.నయ్యర్‌, శంకర్‌-జైకిషన్‌లు, మరొక ముఖ్యులు ఎస్‌.డి.బర్మన్‌. దక్షిణదేశంలో స్వర్గీయ సుబ్బరామన్‌, శ్రీయుతులు రామనాథన్‌, కె.వి.మహదేవన్‌, విశ్వనాథన్‌-రామ్మూర్తి, ఎస్‌.వి.వెంకటరామన్‌, సాలూరు రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు మొదలగు వారు గణనీయులు.

సినిమా సంగీతాన్ని స్థూలంగా పరిశీలించినప్పుడు గేయానికి చెందిన భాగం మన సంప్రదాయాలనూ, చిత్రీకరణకు అవసరమయే నేపధ్య సంగీతం పాశ్చాత్య పద్ధతులను అనుసరిస్తున్నట్టు తెలుసుకొనవచ్చును. గేయభాగాలలో కూడా విదేశీ సంగీతరీతుల్ని వాడిన సంధర్బాలు లేకపోలేదు. అయితే ఈ విధమైన ప్రయోగాల వలన మన జాతీయమైన పలుకుబడికి దూరమై అవాంఛితికి పాల్పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయమై సంగీత దర్శకులు శ్రద్ధ తీసుకొనటం ఎంతైనా అవసరం. అయితే ప్రస్తుత సంగీత రచనా విధానం ప్రయోగస్థితిలో ఉంది. నిర్దిష్టమైన పరిమితుల్ని ఏర్పరచి ప్రతిభావంతులైన సంగీత దర్శకుల కృషికి అవరోధం కలిగించే పరిస్థితిలో లేదు.

భారతీయ సంగీత చరిత్రలో జంత్రసమ్మేళన పద్ధతి నూతనమైనది. ప్రాచీన సంగీత రచనలలో ప్రత్యేకించి జంత్రసమ్మేళనకై నిర్దేశింపబడిన స్వరరచనలు కనపడవు. ప్రధానంగా భారతీయ సంగీతం మెలొడీ మీద ఆధారపడి ఉంది. ఇది రస నిష్పత్తికి గనుక యుక్తమైన రాగప్రస్తారానికి ప్రాముఖ్యతనిస్తుంది. ఇట్లు కాక పాశ్చాత్య సంగీతం హార్మోనీకి ప్రాధాన్యం ఇవ్వడం వలన జంత్రసమ్మేళనల విషయంలో పాశ్చాత్య సంగీతకారులు అతి ఉదాత్తమైన ఫలితాలను సాధించియున్నారు. ఈ సమ్మేళన విషయంలో పాశ్చాత్య పద్ధతి నుంచి మనం తెలుసుకొనవలసినది ఎంతో ఉన్నది. వాది, సంవాది, వివాది స్వర ప్రయోగాలలో పాశ్చాత్యులు రసార్ణవం యొక్క అగాధమైన లోతులకి పోయారు.

ఈ పరిస్థితులలో భారత సంగీత దర్శకుడు ప్రజారంజన అనే తన లక్ష్యసిద్ధి కోదం వివిధ విజాతీయ సంగీత సంప్రదాయాల సమన్వయం తన కృషిలో భాగంగా తీసుకొంటున్నాడు. ఈ క్రొత్త ప్రయోగాలలో కొన్ని అవాంఛనీయమైన ఫలితాలు రావచ్చును. అందుకు రసికలోకం నిరుత్సాహపడకూడదు.

సంగీత దర్శకుని బాధ్యత పాటలతోనే తీరదు. చిత్రంలోని ప్రతి సన్నివేశానికి ఆయా రసాలకు తగినట్లుగా నాదరూపమైన వ్యాఖ్య ఇవ్వటం కూడా అతని పనే. ఈ నాదాత్మకమైన వ్యాఖ్యనే రీరికార్డింగ్‌ అంటారు. ఈ రీరికార్డింగ్‌లో వినపడే నేపధ్య సంగీతం ఒక సంగీత దర్శకుని ప్రతిభకు దర్పణం వంటిది. రసాత్మకమైన సన్నివేశాలకు ఆయా రసోత్పన్న శక్తిగల ఈ సంగీత వ్యాఖ్యను సృష్టించటానికి ఎంతో భావనాశక్తి, కాలజ్ఞానమూ, అనుభవమూ అవసరం. అసమర్థమైన రీరికార్డింగ్‌ చిత్రం పేలవంగా తోపింపజేస్తుంది. ప్రజ్ఞావంతమైన రీరికార్డింగ్‌ బలహీనమైన సన్నివేశాన్ని కూడ చిత్రంలో కుదుటపరచగలదు.

ఎంతో ప్రతిభ, వ్యుత్పత్తి, అనుభవమూ కలిగిన సంగీత దర్శకుని కృషి కూడా వ్యక్తిగతమైన ఉదాత్త కళ లోభం వలన ప్రజాభిరుచికి దూరమయే అవకాశం ఉంది. అందుచేత సంగీత దర్శకుడు తన స్వంత కళాభిరుచితో బాటు, ప్రజాభిరుచి, చిత్ర పరిశ్రమ యొక్క ఆర్థిక నిబంధనలనీ గుర్తు పెట్టుకొనవలసి ఉన్నది.

నేపధ్య గాయకునిగా నాకు గల అనుభవాన్ని బట్టి నాలుగు మాటలు చెప్పవలసి ఉంది. నేపధ్య గాయకునికి శ్రావ్యమైన కంఠస్వరమూ, వివిధ సంగీత గమకములు పలికించగల శక్తితో బాటు రసభావములకు అనుగుణ్యమైన నాదోత్పత్తి, సుస్పష్టమైన ఉచ్ఛారణ, కంఠస్వరము యొక్క పట్టువిడుపులు తెలియడం చాలా అవసరం. తన భావాలను పోషించగల గాత్రశైలి ఏ శాస్త్రములోను, ఏ పారిభాషిక పదాలలోను నిర్వచించబడనిది. అనుభవమే గురువుగా తనకు తానై తెలుసుకోవలసినది. నా భావనలో నేపధ్య గాయకునికి సంగీత హృదయంతో బాటు కవిహృదయము, కంఠస్వరములోని మెళకువలతోనే నటించగల నటనాకౌశలము కూడా అవసరం.

వృత్తిని బట్టి నేపధ్య గాయకునికి బాధ్యత యింకా ఉన్నది. తన నుండి ఉత్తమ ఫలితాన్ని ఆశించే సంగీత దర్శకుల భావనకు అనుగుణంగా రస సంపూర్ణ సహకారం ఎంతో సద్భావంతో ఇవ్వవలసి ఉంది. ఈ సందర్భంలో వివిధ సంగీత దర్శకుల ప్రతిభాన్వితములైన సంగీత రచనలను తమ గాత్రమాధుర్యంతో రసికలోకానికి అందించిన ఉత్తమ గాయకులు ప్రశంసార్హులు. లతా మంగేష్కర్‌, గీతాదత్‌, షంషాద్‌, ఆషా, మహమ్మద్‌ రఫీ, తలత్‌ మహమ్మద్‌, మన్నాడే, ముఖేష్‌ మొదలగు ఉత్తరదేశ గాయకులు, సుశీల, లీల, జానకి, సౌందరరాజన్‌, గోవిందరాజన్‌, జయరామన్‌, లోకనాథన్‌, శ్రీనివాస్‌, రాజా, మాధవపెద్ది, పిఠాపురం మొదలగు దక్షిణదేశ గాయకులు సినీసంగీతసీమకు వరప్రసాదులుగా భావించవలసి ఉంది.

కళాకారునిగా నా అనుభవాన్ని బట్టి నా గాఢ విశ్వాసాన్ని తెలియజేసే మాట ఒకటి చెప్పవలసి ఉంది. కళాకారుని నుండి వ్యక్తమయ్యే కళాకాంతిలో అతడు జీవితంలో పొందిన అనుభవాల గాఢత్వము, తీవ్రత ప్రతిబింబించక మానవు. భావతీవ్రత, ఆర్ద్రత లేని హృదయం నుండి ఉత్తమమైన కళ వ్యక్తమయ్యే అవకాశం లేదు. అందుచేత కళాకారుడు కళాసాధనతో తుల్యంగా జీవిత అనుభవాల నుండి ఉన్నతమైన సంస్కారాన్ని కలిగించుకోవలసి ఉంది.

ప్రజల ఉత్తమమైన అభిరుచులతో, విజ్ఞత, బాధ్యత, సానుభూతితో కూడిన సద్విమర్శతో ప్రతిభావంతులైన సంగీత దర్శకుల ప్రజ్ఞావిశేషంతో, నేపధ్య గాయకుల నైపుణీరాగంతో మన సంగీత సంప్రదాయం ఎంతో వృద్ధిని, ఉత్తేజాన్ని పొందగలదని నా అచంచల విశ్వాసం.

సేకరణ: చల్లా సుబ్బారాయుడు, కనిగిరి (29-3-1963 ఆంధ్రపత్రిక వారపత్రిక)


sumaaru reMDu daSaabdamula nuMci saMgeeta darSakunigaa, nEpadhya gaayakunigaa sinimaa saMgeeta prapaMcaMlO nEnu cEsina pariSramaku aadhaarabhUtamaina viSwaasaalaku, tadbhavamaina anubhavaalu rasikulU, rasaj~nulU ayina prEkshakalOkaaniki teliyajEyaDaM aprastutaM kaadanE nammakaMtO ee maaTalu vraastunnaanu. tana saadhana, kRshi phaliMcaalaMTE, saarthakata ceMdaalaMTE prati kaLaakaaruDU prajalatO tanaku gala saMbaMdhaanni nityamu gurtistU, kaLaaraMgaMlO tanakunna baadhyatalanu, yedurkonavalasina Saktulanu vaariki teliyajEstU vaari nuMDi vij~nataapUrvakamayina salahaalanu, abhimaanOpEtamayina saanubhUtinI poMdutuMDaTaM avasaramavutuMdi.

prati jaati saMskRtI kaLaaraMgaMlO tana kRshinI, dhyEyaanni, oka viSishTamaina paddhatini rUpoMdiMcukoMTuMdi. bhaaratadESaM kUDaa sahasraabdaalugaa lalitakaLalanniTilOnU tana viSishTatanu aDugaDugunaa prasphuTaMgaa prakaTistU tana saadhananu konasaagistUnE uMdi.

bhaarateeya jeevana raMgaMlO saMgeetakaLakunna sthaanaM marE saMskRtilOnU lEdani ceppaDaM saahasaM kaadu. bhaaratajaati anaadigaa, saMgeetakaLanu pratyEkamaina vidhaanaalatO, vibhinna maargaalalO payaniMpajEsi eMtO ujjvalamaina phalitaanni saadhiMciMdi. saMpradaayasiddhamaina ee kaLaaviSEshaanni vismariMci manaM E vidhamaina abhivRddhinI saadhiMcalEmu.

bhaarateeya saMgeetaM enni bhinna saaMpradaayaalni anusariMcinaa, enni bhinna reetulni pradarSiMcinaa, rasasiddhilO ee bhinna phaNatulu avalaMbiMcE maargamulO oka vicitramaina aikyatanu ErparacukoMdi. sUkshaMgaa pariSeelistE, bhaarateeya saMgeetaMlO E praaMtapudainaa sarE EkatvaM gOcariMcaka maanadu.

pradhaanaMgaa bhaarateeya saMgeeta sravaMti reMDu rasavaahinulugaa pravahiMcinadi. okaTi swararaaga taaLa pradhaanamainadi. Saastreeyamaina vyaktitvaanni kaliginadi. naadOpaasanaku upayuktamainadi. reMDavadi jeevana SakaTa prayaaNaaniki aharahamU laya kaluputU nityajeevitaanni sumadhuraM cEsEdi. modaTidi #'#maarga#'# saMgeetamani, reMDavadi #'#dESi#'# saMgeetamani paMDitulu ceppaaru. okaTi rasaatmakamainadi. reMDavadi bhaavaatmakamainadi. okaTi sthiti pradhaanamainadi, marokaTi gati pradhaanamainadi. jeevitaMlOni vaividhyaanni tolagiMci okE naadaatmalO swaraanni anubhaviMpajEsEdi maargasaMgeetamaitE, okE aatmanu jeevitaMlOni vividha raMgaalalO pratibiMbiMci hRdayaspaMdanaM kaligiMcEdi dESi saMgeetaM.

maargasaMgeeta saMpradaaya saraLi unnata vargaanni aakarSiMci raajaasthaanamulalOnU, dEvasthaanamulalOnU tana pratibhanu prasariMpajEstE, dESi saMgeetaM prati paamaruni hRdayasthaanaMlOnu siMhapathaM cEsukoMdi. maargasaMgeetaM bhaarateeyaatmatanu taattvikamaina rasaanubhUtitO maimarapiMpajEstE, dESi saMgeetaM rasikamaina rasapushTitO prajaaneekaanni muripiMpajEsiMdi. iMducEtanE Saastreeya vaaggEya racanalalO bhaktibhaavaanikE adhikamaina praacuryaM labhiMciMdi.

oka vidhaMgaa anukOvaccunu. Saastreeya saMgeetaM bhaktibhaavapuneetamaitE dESi saMgeetaM navarasabharitaM. jeevitaMlOni prati rasaatmaka sannivESaanni tanalO imuDcukuMdi dESi saMgeetaM. ee bhinna rasaala sannivESaalanu okE naadavarNaMlO citriMcinadi maarga saMgeetaM.

uDupula vELallO paccani polaallO pani cEstU, tama kashTaanni maraci goMtetti paaDE palle paDucula paaTalalOnU, noorpula kaLLaalalO aanaMdOtsaahaMtO oogutunna raitu yuvakula padaalalOnu, ElElO paaTalalOnU, jOla paaTalalOnU, peMDli paaTalalOnU, vadinaa maradaLLa saraagaalalOnU, aalUmagala sarasaalalOnU, attaakODaLLa saMvaadaalalOnU, nalugu paaTalalOnU, tattva keertanalalOnU, paDava paaTalalOnU, yakshagaanaalalOnU, bu~r~rakathalalOnU, golla suddulalOnU, veedhi bhaagavataalalOnU, jamukala paaTalalOnU vinipiMcEdi dESi saMgeetamE.

iMta varaku mana jaateeya saMgeetaM, maarga paddhati ayitEnEmi, dESi paddhati ayitEnEmi, vividha Saastreeya saMgeeta racanala roopaMlOnU, padya paThana rUpaMlOnU harikathaadi rUpaalalOnU, paina ceppukunna dESIya rUpaalalOnU vyaktamayiMdi.

prastuta naagarika jeevana vidhaanaanni baTTi, paaScaatya saMgeeta prabhaavaanni baTTi vyaavahaarika bhaashaa prabhaavaanni baTTi, oka nUtana saMgeeta saMpradaaya nirmaaNaM ati utsaahaMgaanu, ati tvaritaMgaanu saagutunnadi. koMta kaalaM niScalaMgaa unna mana dESeeya saMgeetaM sinimaa kaLa yokka abhivRddhitO nUtanOttEjaanni poMdi kotta raMgulu raMgariMcukoMdi.

ee nUtana saMgeeta saMpradaaya nirmaaNaM sinI saMgeeta darSakula pratibhaa viSEshaala baTTi nirmiMpabaDutunnadavaDaM pariNaamamainaa, tana viSishTataku bhaMgaM kaligistunnadEmOyani bhayapaDutunnadi. aMducEta saMgeetaMlO nUtanamaina prayOgaalanU, vinUtnamaina viSEshaalanU, vicitraanubhUtulanu vividha maargaalalO abhivRddhulanu sinI saMgeeta darSakula nuMDi maatramE dESaM aaSistunnadanaDaM vaastavaM.

iTuvaMTi paristhitullO saMgeeta darSakuDu mana jaateeya dhOraNulaina rasaatmaka praadhaanyamaina maarga saMgeetaanni, bhaavaatmaka praadhaanyamaina dESi saMgeetaanni, vijaateeya saMgeeta reetulni, tana nUtana saMpradaaya sRshTiki upakaraNamulugaa teesukoMTunnaaDu.

ee nUtana saMpradaaya nirmaaNaM uttara bhaaratadESaMlOnE praaraMbhiMcabaDinadanaTaM saahasaM kaadu. sinimaa pariSramaku poorvaM kooDaa mana naaTaka saMgeetaMlO padyapaThanaaniki Saastreeya saMgeeta raagaalanU, paaTalaku uttara dESa lalita saMgeeta racanalanU, oravaDigaa teesukonaDaM jarigiMdi. ayitE prastutaM ee saMpradaaya nirmaaNaM sinimaa yokka paariSraamika parimitulni baTTi maatramE saagutunnadanna maaTa yadaarthaM.

nETi varakU naDacina sinimaa saMgeeta caritra oka maaru siMhaavalOkanaM cEstE tolinaaTi sinimaa saMgeetaMlO Saastreeya saMgeeta prabhaavamE ekkuvagaa uMDi raagapradhaana racanalE ekkuvagaa kanabaDutaayi. kaani kaalakramaana saMgeeta darSakulu bhaasha yokka palukubaDikee, nuDikaarapu gamanaaniki, bhaavaavESaanikee dESi saMgeetamE anukoolamainadani grahiMcaaru. ee dESi reetini sinimaa saMgeetaMlO modaTa pravESapeTTina maargadarSi naushad^ anE maaTa sarva janaamOdaM poMdutuMdanE nammutunnaanu. dESi saMgeeta paddhatulalO, prati rasaatmaka sannivESaanikI aayana tana saMgeeta racanalatO roopiMcina raaga taaLamula prayOgaM samakaalika saMgeeta darSakulaku sweekaarayOgyamayinadi. SRMgaarageetaalu, yugaLageetaalu, vishaadageetaalu, prEmagaanaalu, bRMdagaanaalu modalaina aayana saMgeeta racanalannee aayananu navya saaMpradaaya nirmaatagaa nirUpistaayi.

naushad^tObaaTu, pratibhaavaMtulayina itara saMgeeta darSakula mEdhassu kooDa ee krotta saMpradaayaanni samujjvalapariciMdi. navya saMgeeta nirmaatalugaa pErkonabaDavalasina vaarilO pradhaanulu si.raamacaMdra, anil^ biswaas^, paMkaj^ mallik^, vasaMta dESaay^, hEmaMtakumaar^, O.pi.nayyar^, SaMkar#-#jaikishan^lu, maroka mukhyulu es^.Di.barman^. dakshiNadESaMlO swargeeya subbaraaman^, Sreeyutulu raamanaathan^, ke.vi.mahadEvan^, viSwanaathan^#-#raammUrti, es.vi.veMkaTaraaman^, saalUru raajESwararaavu, peMDyaala naagESwararaavu modalagu vaaru gaNaneeyulu.

sinimaa saMgeetaanni sthUlaMgaa pariSeeliMcinappuDu gEyaaniki ceMdina bhaagaM mana saMpradaayaalanU, citreekaraNaku avasaramayE nEpadhya saMgeetaM paaScaatya paddhatulanu anusaristunnaTTu telusukonavaccunu. gEyabhaagaalalO kooDaa vidESee saMgeetareetulni vaaDina saMdharbaalu lEkapOlEdu. ayitE ee vidhamaina prayOgaala valana mana jaateeyamaina palukubaDiki dooramai avaaMCitiki paalpaDE avakaaSaM ekkuvagaa uMdi. ee vishayamai saMgeeta darSakulu Sraddha teesukonaTaM eMtainaa avasaraM. ayitE prastuta saMgeeta racanaa vidhaanaM prayOgasthitilO uMdi. nirdishTamaina parimitulni Erparaci pratibhaavaMtulaina saMgeeta darSakula kRshiki avarOdhaM kaligiMcE paristhitilO lEdu.

bhaarateeya saMgeeta caritralO jaMtrasammELana paddhati nootanamainadi. praaceena saMgeeta racanalalO pratyEkiMci jaMtrasammELanakai nirdESiMpabaDina swararacanalu kanapaDavu. pradhaanaMgaa bhaarateeya saMgeetaM meloDee meeda aadhaarapaDi uMdi. idi rasa nishpattiki ganuka yuktamaina raagaprastaaraaniki praamukhyatanistuMdi. iTlu kaaka paaScaatya saMgeetaM haarmOneeki praadhaanyaM ivvaDaM valana jaMtrasammELanala vishayaMlO paaScaatya saMgeetakaarulu ati udaattamaina phalitaalanu saadhiMciyunnaaru. ee sammELana vishayaMlO paaScaatya paddhati nuMci manaM telusukonavalasinadi eMtO unnadi. vaadi, saMvaadi, vivaadi swara prayOgaalalO paaScaatyulu rasaarNavaM yokka agaadhamaina lOtulaki pOyaaru.

ee paristhitulalO bhaarata saMgeeta darSakuDu prajaaraMjana anE tana lakshyasiddhi kOdaM vividha vijaateeya saMgeeta saMpradaayaala samanvayaM tana kRshilO bhaagaMgaa teesukoMTunnaaDu. ee krotta prayOgaalalO konni avaaMCaneeyamaina phalitaalu raavaccunu. aMduku rasikalOkaM nirutsaahapaDakooDadu.

saMgeeta darSakuni baadhyata paaTalatOnE teeradu. citraMlOni prati sannivESaaniki aayaa rasaalaku taginaTlugaa naadaroopamaina vyaakhya ivvaTaM kooDaa atani panE. ee naadaatmakamaina vyaakhyanE reerikaarDiMg^ aMTaaru. ee reerikaarDiMg^lO vinapaDE nEpadhya saMgeetaM oka saMgeeta darSakuni pratibhaku darpaNaM vaMTidi. rasaatmakamaina sannivESaalaku aayaa rasOtpanna Saktigala ee saMgeeta vyaakhyanu sRshTiMcaTaaniki eMtO bhaavanaaSakti, kaalaj~naanamU, anubhavamU avasaraM. asamarthamaina reerikaarDiMg^ citraM pElavaMgaa tOpiMpajEstuMdi. praj~naavaMtamaina reerikaarDiMg^ balaheenamaina sannivESaanni kooDa citraMlO kuduTaparacagaladu.

eMtO pratibha, vyutpatti, anubhavamU kaligina saMgeeta darSakuni kRshi kooDaa vyaktigatamaina udaatta kaLa lObhaM valana prajaabhiruciki dooramayE avakaaSaM uMdi. aMducEta saMgeeta darSakuDu tana swaMta kaLaabhirucitO baaTu, prajaabhiruci, citra pariSrama yokka aarthika nibaMdhanalanee gurtu peTTukonavalasi unnadi.

nEpadhya gaayakunigaa naaku gala anubhavaanni baTTi naalugu maaTalu ceppavalasi uMdi. nEpadhya gaayakuniki Sraavyamaina kaMThaswaramU, vividha saMgeeta gamakamulu palikiMcagala SaktitO baaTu rasabhaavamulaku anuguNyamaina naadOtpatti, suspashTamaina ucCaaraNa, kaMThaswaramu yokka paTTuviDupulu teliyaDaM caalaa avasaraM. tana bhaavaalanu pOshiMcagala gaatraSaili E SaastramulOnu, E paaribhaashika padaalalOnu nirvaciMcabaDanidi. anubhavamE guruvugaa tanaku taanai telusukOvalasinadi. naa bhaavanalO nEpadhya gaayakuniki saMgeeta hRdayaMtO baaTu kavihRdayamu, kaMThaswaramulOni meLakuvalatOnE naTiMcagala naTanaakauSalamu kooDaa avasaraM.

vRttini baTTi nEpadhya gaayakuniki baadhyata yiMkaa unnadi. tana nuMDi uttama phalitaanni aaSiMcE saMgeeta darSakula bhaavanaku anuguNaMgaa rasa saMpoorNa sahakaaraM eMtO sadbhaavaMtO ivvavalasi uMdi. ee saMdarbhaMlO vividha saMgeeta darSakula pratibhaanvitamulaina saMgeeta racanalanu tama gaatramaadhuryaMtO rasikalOkaaniki aMdiMcina uttama gaayakulu praSaMsaarhulu. lataa maMgEshkar^, geetaadat^, shaMshaad^, aashaa, mahammad^ rafee, talat^ mahammad^, mannaaDE, mukhEsh^ modalagu uttaradESa gaayakulu, suSeela, leela, jaanaki, sauMdararaajan^, gOviMdaraajan^, jayaraaman^, lOkanaathan^, Sreenivaas^, raajaa, maadhavapeddi, piThaapuraM modalagu dakshiNadESa gaayakulu sineesaMgeetaseemaku varaprasaadulugaa bhaaviMcavalasi uMdi.

kaLaakaarunigaa naa anubhavaanni baTTi naa gaaDha viSwaasaanni teliyajEsE maaTa okaTi ceppavalasi uMdi. kaLaakaaruni nuMDi vyaktamayyE kaLaakaaMtilO ataDu jeevitaMlO poMdina anubhavaala gaaDhatvamu, teevrata pratibiMbiMcaka maanavu. bhaavateevrata, aardrata lEni hRdayaM nuMDi uttamamaina kaLa vyaktamayyE avakaaSaM lEdu. aMducEta kaLaakaaruDu kaLaasaadhanatO tulyaMgaa jeevita anubhavaala nuMDi unnatamaina saMskaaraanni kaligiMcukOvalasi uMdi.

prajala uttamamaina abhiruculatO, vij~nata, baadhyata, saanubhootitO kooDina sadvimarSatO pratibhaavaMtulaina saMgeeta darSakula praj~naaviSEshaMtO, nEpadhya gaayakula naipuNeeraagaMtO mana saMgeeta saMpradaayaM eMtO vRddhini, uttEjaanni poMdagaladani naa acaMcala viSwaasaM.

sEkaraNa: callaa subbaaraayuDu, kanigiri (29-3-1963 aaMdhrapatrika vaarapatrika)