Ghantasala's Bhagawad Gita
Part 4 (Last)

View This Page In English Fonts





నాల్గవ భాగము

077  పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాఁ జ్ఞానముత్తమం   
     యజ్జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః          (14:01)
జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు మోక్షమును పొందిరి. అట్టి అహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను.

078  సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః 
     తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా               (14:04)
అర్జునా! ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది. నేను తండ్రి వంటివాడను.

079  తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశకమనామయం   
     సుఖసఙ్గేన బధ్నాతి జ్ఞానసఙ్గేన చానఘ              (14:06)
అర్జునా! త్రిగుణములలో సత్త్వగుణము నిర్మలమగుటంజేసి సుఖ జ్ఞానాభి లాషలచేత ఆత్మను దేహమునందు బంధించుచున్నది.

080  రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసఙ్గసముద్భవం   
     తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసఙ్గేన దేహినం                  (14:07)
ఓ కౌంతేయా! రజోగుణము కోరికలయందు అభిమానమూ, అనురాగమూ పుట్టించి ఆత్మను బంధించుచున్నది.

081  తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం        ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత                (14:08)
అర్జునా! అజ్ఞానమువలన పుట్టునది తమోగుణము. అది సర్వ ప్రాణులనూ మోహింపజేయునది. ఆ గుణము మనుజుని ఆలస్యముతోనూ, అజాగ్రత్తతోనూ, నిద్ర తోనూ బద్ధుని చేయును.

082  మానాపమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః 
     సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే                (14:25)
మానావ మానములయందు, శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు.

083  ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయం   
     చ్హందాఁసి యస్య పర్ణాని యస్తఁ వేద స వేదవిత్            (15:01)
బ్రహ్మమే మూలముగా, నికృష్ణమైన అహంకారము కొమ్మలుగాగల అశ్వత్థ వృక్షము అనాది అయినది. అట్టి సంసార వృక్షమునకు వేదములు ఆకులువంటివి. అట్టి దాని నెరింగినవాడే వేదార్థ సార మెరింగినవాడు.

084  న తద్భాసయతే సూర్యో న శశాఙ్కో న పావకః 
     యద్గత్వా న నివర్తఁతే తద్ధామ పరమం మమ                (15:06)
పునరావృత్తి రహితమైన మోక్షపథము, సూర్య చంద్రాగ్నుల ప్రకాశమున కతీతమై, నా ఉత్తమ పథమై యున్నది.

085  అహఁ వైశ్వానరో భూత్వా ప్రాణినాఁ దేహమాశ్రితః 
     ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నఁ చతుర్విధం           (15:14)
దేహులందు జఠరాగ్ని స్వరూపుడనై వారు భుజించు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను.

086  తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా 
     భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత                 (16:03)
     దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ 
     అజ్ఞానఁ చాభిజాతస్య పార్థ సంపదమాసురీం            (16:04)
పార్థా! సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరుల వంచింపకుండుట, కావరము లేకయుండుట, మొదలగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే, దంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠినపు మాటలాడుట, అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశ సంభూతులకుండును.

087  త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః 
     కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్           (16:21)
కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశనము చేయును. అవి నరక ప్రాప్తికి హేతువులు కావున వానిని వదిలి వేయ వలయును.

088  యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః 
     న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం               (16:23)
శాస్త్ర విషయముల ననుసరింపక ఇచ్చా మార్గమున ప్రవర్తించువాడు సుఖ సిద్ధులను పొందజాలడు. పరమపదము నందజాలడు.

089  త్రివిధా భవతి శ్రద్ధా దేహినాఁ సా స్వభావజా 
     సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాఁ శృణు           (17:02)
జీవులకు గల శ్రద్ధ పూర్వ జన్మ వాసనా బలము వలన లభ్యము. అది రాజసము, సాత్త్వికము, తామసములని మూడు విధములగా ఉన్నది.

090  యజంతే సాత్త్వికా దేవాన్యక్షరక్షాఁసి రాజసాః 
     ప్రేతాంభూతగణాఁశ్చాన్యే యజంతే తామసా జనాః          (17:04)
సత్త్వగుణులు దేవతలను, రజోగుణులు యక్ష రాక్షసులను, తమోగుణులు భూత ప్రేత గణంబులను శ్రద్ధా భక్తులతో పూజించుదురు.

091  అనుద్వేగకరం వాక్యఁ సత్యం ప్రియహితఁ చ యత్     
     స్వాధ్యాయాభ్యసనఁ చైవ వాఙ్మయం తప ఉచ్యతే          (17:15)
ఇతరుల మనస్సుల నొప్పింపనిదియూ, ప్రియమూ, హితములతో కూడిన సత్య భాషణమూ, వేదాధ్యన మొనర్చుట వాచక తపస్సని చెప్పబడును.

092  కామ్యానాఁ కర్మణాఁ న్యాసం సఁన్యాసం కవయో విదుః 
     సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః           (18:02)
జ్యోతిష్ఠోమాది కర్మల నాచరింపకుండుట సన్యాసమనియూ, కర్మఫలము ఈశ్వరార్పణ మొనర్చుట త్యాగమనియూ పెద్దలు చెప్పుదురు.

093  అనిష్టమిష్టం మిశ్రఁ చ త్రివిధం కర్మణః ఫలం   
     భవత్యత్యాగినాం ప్రేత్య న తు సఁన్యాసినాఁ క్వచిత్        (18:12)
కర్మఫలములు ప్రియములూ, అప్రియములూ, ప్రియాతిప్రియములూ అని మూడు విధములు. కర్మఫలమునలు కోరినవారు జన్మాంతరమందు ఆ ఫలములను పొందుచున్నారు. కోరనివారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాల కున్నారు.

094  ప్రవృత్తిఁ చ నివృత్తిఁ చ కార్యాకార్యే భయాభయే 
     బంధం మోక్షఁ చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ (18:30)
అర్జునా! కర్మ మోక్ష మార్గముల, కర్తవ్య భయాభయముల, బంధ మోక్షముల ఏ జ్ఞానమెరుగుచున్నదో అది సత్త్వగుణ సముద్భవమని ఎరుగుము.

095  ఈశ్వరః సర్వభూతానాఁ హృద్దేశేర్జున తిష్ఠతి 
     భ్రామయన్సర్వభూతాని యంత్రారూఢాని మాయయా             (18:61)
ఈశ్వరుడు యెల్ల భూతములకు నియామకుడై, ప్రాణుల హృదయమందున్నవాడై, జంత్రగాడు బొమ్మలనాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు.

096  సర్వధర్మాంపరిత్యజ్య మామేకం శరణం వ్రజ 
     అహం త్వాం సర్వపాపేభ్యో మోక్ష్యయిష్యామి మా శుచః         (18:66)
సమస్త కర్మలను నాకర్పించి, నన్నే శరణు బొందిన, ఎల్ల పాపములనుండి నిన్ను విముక్తుని గావింతును. నీవు చింతింపకుము.

097  య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి 
     భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసఁశయః           (18:68)
ఎవడు పరమోత్కృష్టమైన, పరమ రహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తుల కుపదేశము చేయుచున్నాడో, వాడు మోక్షమున కర్హుడు.

098  కచ్చిదేతచ్చ్హ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా 
     కచ్చిదజ్ఞానసంమోహః ప్రనష్టస్తే ధనఁజయ             (18:72)
ధనంజయా! పరమ గోప్యమైన యీ గీతా శాస్త్రమును చక్కగా వింటివా? నీ యజ్ఞాన జనితమైన అవివేకము నశించినదా? కృష్ణా!

099  నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత 
     స్థితోస్మి గతసఁదేహః కరిష్యే వచనం తవ                (18:73)
అచ్యుతా! నా అవివేకము నీ దయ వలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించినది. నాకు సందేహములన్నియూ తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించెదను.

100  యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః 
     తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ               (18:78)
యోగీశ్వరుడగు శ్రీకృష్ణుడు, ధనుర్ధారియగు అర్జునుడు యెచటనుందురో అచట సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతియుండును.

     గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ త్రయతత్కుమాన్
     విష్ణొపద మవాప్నోతి భయ శోకాది వర్జితః
గీతాశాస్త్రమును ఎవరు పఠింతురో వారు భయ శోకాది వర్జితులై విష్ణు సాయుజ్యమును పొందుదురు.

ఇది ఉపనిషత్తుల సారాన్శమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునునకుప దేశించిన గుణత్రయ విభాగ, పురుషోత్తమ ప్రాప్తి, దేవాసుర సంపద్విభాగ, శ్రద్ధాత్రయ విభాగ, మోక్షసన్యాస యోగములు సర్వమూ సమాప్తము.

			ఓం సర్వేజనా సుఖినో భవంతు
			సమస్త సన్మగళాని భవంతు  
			అసతోమా సద్గమయ
			తమసోమా జ్యోతిర్గమయ
			మృత్యోర్మా అమృతంగమయ
			ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః